Wednesday, February 5, 2014

జంటపదాలమై...

ఉండి-ఉండి అనుకోకుండా దగ్గరైనావు
మెల్ల-మెల్లగా నా మనసునే దోచేసావు

చూస్తూ-చూస్తూ వెర్రిమది నీదైపోయింది
తియ-తీయని నీ ప్రేమలో పడిపోయింది

పదే-పదే పెదాలు నీపేరే పలుకుతున్నాయి
నన్ను-నన్నుగా నిలువనీయక ఉన్నాయి

చిన్ని-చిన్ని సైగలతో నన్ను మాయచేసావు
మిణుకు-మిణుకుమన్న కోర్కెల సెగ రేపావు

ఏవో-ఏవో కలలంటూ మనసు మాటవినకుంది
నువ్వే-నువ్వే కావాలని కునుకు కలవరిస్తుంది

ఇలా-ఇలా తెలియకనే నావన్నీ నీ వసమైనాయి
క్రమ-క్రమంగా నాలోనే నన్ను లేకుండా చేసాయి

చిలిపి-చిలిపి చేష్టలతో చిత్రంగా ఒకటి అయినాము
ఏడు-ఏడు జన్మలకి జంటపదమై మనముందాము

ఒకే ఒక్కసారి....

ఒకోసారి నీవు నాలో ఐక్యమైనట్లనిపిస్తావు 
అంతలోనే....అల్లంత దూరాన అగుపిస్తావు 
ఎందుకిలా? అని నన్ను నే ప్రశ్నించుకుంటే
నీడనని.....వెలుగులోనే అగుపిస్తానంటావు!

మరోసారి నీవు మారువేషంలో మరిపిస్తావు
క్షణాల్లో....కంటికెదురుగా కనుమరుగౌతావు
ఏమైందని? మేలుకుని తరచి చూసుకుంటే
కలనని.....కనులు తెరిస్తే మాయమంటావు!

ఇంకోసారి నీవు నాపై నన్నే ఉసిగొల్పుతావు
అందులో....అగుపడని అనురాగమందించేవు
ఏమిటిదని? విసురుగా కసిరి పొమ్మని అంటే
మనసని.....మాటవినదు వేదనపడమంటావు!

ఒక్కసారి నా అనుమతి అడగకనే కౌగిలిస్తావు
నాలో....నా అనుకున్న బంధాలన్నీ తెంచేస్తావు
ఎవరని? నే అడిగేలోపే పాశమేసి జవాబిస్తావు
ప్రాణమని.....ఉన్నంతవరకే ప్రాకులాటలంటావు!